- శాంతి ప్రియ
నీ ధన ప్రీతి గూర్చి నే పాడలేను
దైవ ఘన కీర్తిని నే వీడలేను
నేను చూశాను ఐహిక లాలసతో వివేకం
కోల్పోయిన అవివేకుల్ని
నేను చూశాను కామంతో కళ్ళు
మూసుకుపోయిన నర రూప రాక్షసుల్ని
నేను చూశాను మద్యం మత్తులో జూదం
ఆడుతూ మగువలకు వెల కట్టిన కుబేరుల్ని
అందుకే-
నీ మాయ మాటలను నే నమ్మలేను
మహా ప్రవక్త మహితోక్తులను నే మరువలేను
నేను చూశాను మత కలహాల్లో మాడి
మసి అయిన మహిళామణుల్ని, పసి పిల్లల్ని
నేను చూశాను నిరంకుశ నమ్రూదులను
మృగరూప నరేంద్రులను, ఫిర్‌ఔన్, హామానులను
నేను చూశాను అలగా జనాల అత్యాచారానికి
బలైన అబలలను, నిండు గర్భిణులను
నేను చూశాను నిజంగా త్రిశూల కొనలకు
వ్రేలాడుతున్న మూడు మాసాల పసి కూనలను
నేను చూశాను నిజంగా తుపాకీ తూటాలకు
తూట్లు పడిన తల్లి హృదయాన్ని,, ఇరాక్, ఫలస్తీనాల్ని
అందుకే-
నీ చదరంగానికి నే పావుని కాలేను
మహితాత్ముల బాట నే వదలలేను
నేను చూశాను మూర్తీభవత్ దైన్యాన్ని, హైన్యాన్ని
రుద్ధభాష్పాకులిత నయనుడైన వృద్ధ తండ్రిని
నేను చూశాను కన్య కొంగు చాటు కృష్ణుడై
కన్నవారిపై కన్నెర్రజేసిన కసాయి కొడుకుల్ని
నేను చూశాను కనక వ్యామోహంతో కొడుకుల్ని
అమ్మేసుకుంటున్న కట్న పిపాస పిత్రోత్తముల్ని
ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి? ఏ జ్ఞాని జన్మభూమి
గర్వ స్థితి?
నేను పైన దైవానికి జవాబు చెప్పవలసినవాణ్ణి
క్రింద దాసుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాల్సినవాణ్ణి
అందుకే ఓ లోకమా!
నీ వశీకరణ మంత్రాలకు నే లొంగను
క్షంతవ్యంకాని అలసత్వం నే వహించను

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి