2, జులై 2014, బుధవారం

సలాహ్ (నమాజు) విధానం


ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు – మీరు అలాగే నమాజు చదవండి, నన్నుఏ విధంగా నమాజు చదవుతూ చూస్తున్నారో. బుఖారి
నమాజు చేయు విధానం వివరంగా క్రింద ఇవ్వబడినది.
ఖియామ్
అంటే నమాజు చదువుటకు నిలబడుట
తక్బీర్– ఎ– తహ్రీమ
అంటే అల్లాహు అక్బర్ అని నమాజు ప్రారంభించడం
రెండు చేతులనూ అల్లాహు అక్బర్ అంటూ చెవుల వరకు లేక భుజాల వరకు ఎత్తడం
కుడిచేతిని ఎడమచేతి మీద రొమ్ము మధ్య భాగాన ఉంచవలెను.
“సుబహానకల్లాహుమ్మ వబిహందిక వతబారకస్ముక వతఆల జద్దుక వలా ఇలాహగైరుక” అని చదవాలి. దీనిని సనా అంటారు.
సజ్దా చేయనున్న చోట దృష్టిని ఉంచాలి
సూరతుల్ ఫాతిహా
మొదట “అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీం” చదవాలి
“బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం” అనాలి
తరువాత సూరతుల్ ఫాతిహా చదవాలి
గమనిక׃ సూరతుల్ ఫాతిహా తర్వాత ఆమీన్ (ఓ అల్లాహ్ ! మా విన్నపాల్నిఅంగీకరించు) అనాలి
సూరతుల్ ఫాతిహా తరువాత ఏదైనా ఒక పూర్తి సూరహ్ లేదా సూరహ్ లోని కొన్ని వచనాలు (ఆయత్ లు) చదవాలి.
రుకూ చెయ్యాలి
రెండు చేతులనూ అల్లాహు అక్బర్ అంటూ చెవుల వరకు లేక భుజాల వరకు ఎత్తడం
నడుమును (వీపును) ముందుకు వంచి, రెండు చేతులతో రెండు మోకాళ్ళ చిప్పలను గట్టిగా పట్టుకుని, కంటి చూపు సజ్దా చేసేచోట ఉంచవలెను. దీనిని రుకూ అంటారు
రుకూ లో మూడు లేక ఐదు లేక ఏడు సార్లు సుబ్హాన రబ్బియల్ అజీం అనాలి
రుకూ నుండి లేవాలి
రుకూ నుంచి లేచి నిలబడుతూ, రెండు చేతులను భుజాల వరకు లేదా రెండు చెవులకు సమంగా లేపుతూ నమాజు చదివించే వారైనా లేదా ఒంటరిగా నమాజు చేసుకునే వ్యక్తి అయినా సమిఅల్లాహులిమన్ హమిద అనాలి
అందరూ రబ్బనా వలకల్ హమ్ద్ అనాలి
సజ్దా చేయాలి
సజ్దాలోకి వెళ్లడానికి ముందు అల్లాహు అక్బర్ అనాలి
సజ్దానందు మూడు లేక ఐదు లేక ఏడు సార్లు సుబ్హాన రబ్బియల్ ఆఁలా అనాలి
సజ్దా లో ఏడు అంగాలు భూమిని తాకాలి – 1. ముఖం (నుదురు,ముక్కు) 2. రెండు చేతులు 3. రెండు మోకాళ్ళు 4. రెండు పాదాల వ్రేళ్ళు
జల్సఇస్తిరాహత్ చేయాలి– అంటే రెండు సజ్దాల నడుమ కూర్చోడం
సజ్దా నుండి తల ఎత్తునప్పుడు అల్లాహు అక్బర్ అనాలి
రెండు సజ్దాల నడుమ నిదానంగా కూర్చొని మూడుసార్లు రబ్బిగ్ఫిర్లి అనాలి
మొదటి రకాతు పూర్తి అయ్యాక రెండవ రకాతుకై ఖియామ్ చేయ్యడం అంటే లేచి నిలబడడం
లేచి నిలబడుతూ అల్లాహు అక్బర్ అనాలి
మొదటి తషహ్హుద్ చేయాలి׃అంటే రెండు రకాతుల తరువాత తషహ్హుద్ లో కూర్చోవాలి
రెండు రకాతుల తర్వాత కూర్చుని ఈ దుఆ చదవాలి
“అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు వస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు”
అనువాదం׃ స్తుతి, శారీరక – ఆర్ధిక పరమైన ఆరాధనలన్నియూ అల్లాహ్ కొరకే, ఓ ప్రవక్తా ! మీపై అల్లాహ్ కరుణా కటాక్షాలు మరియు శుభాలు కురియుగాక, అల్లాహ్ శుభాలు మాపై మరియు పుణ్యాత్ములైన అల్లాహ్ దాసులపై కురియుగాక, నేను సాక్ష్యమిస్తున్నాను వాస్తవమైన ఆరాధ్యుడు ఎవడు లేడు, కేవలం ఒక్క అల్లాహ్ తప్ప మరియు సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని.
ఆఖరి తషహ్హుద్׃అత్తహియ్యాతు తరువాత దరూద్ షరీఫ్ చదవాలి.
“అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్.
అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్”
ఓ అల్లాహ్ ! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై కరుణ చూపించు మరియు ఆయన పరివారం పై కూడా – ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం పై మరియు ఆయన పరివారంపై కరుణ చూపించావో, నిశ్చయంగా నీవు ప్రశంనీయుడవూ, విధాతవూనూ.
ఓ అల్లాహ్ ! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై శుభాలు కురిపించు మరియు ఆయన పరివారంపై కూడా , ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం పై మరియు ఆయన పరివారంపై శుభాలు కురిపించావో, నిశ్చయంగా నీవు ప్రశంసనీయుడవూ, విధాతవూనూ.
దరూద్ షరీఫ్ తరువాత ఈ దుఆ చదవాలి
“అల్లాహుమ్మఇన్నీ అఊజుబిక మిన్ అజాబి జహన్నమ వ అజాబిల్ ఖబ్ రి వమిన్ ఫిత్నతిల్ మహ్యావల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్” – ఓ అల్లాహ్ ! నేను నీ శరణువేడుతున్నాను నరకయాతన నుండి మరియు సమాధి యాతన నుండి, మరియు శరణు వేడుకుంటున్నాను జీవన్మరణాల నుండి మరియు మసీహ్ దజ్జాల్ చెడు నుండి.


    సలాం చేయడం
    నమాజు ముగించునప్పుడు ముఖాన్ని కుడివైపునకు మరల్చి అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ అనాలి
    మళ్ళీ ఎడమవైపుకు కూడా ముఖాన్ని మరల్చి, అదే విధంగా అనాలి
    నమాజు చేస్తున్నప్పుడు లగ్నము – వినమ్రతలతో పాటు నెమ్మద – నిదానం కూడా ఉండాలి

    నమాజు చేద్ధాం! ఛలో, ఛలో!!


    ప్రియ మిత్రుల్లారా! ధీర విస్వాసి, గొప్ప సహాబీ ఖుబైబ్‌ బిన్‌ ఆదీ గరించి విన్నారా? ఇస్లాం స్వీకరించినందుకుగాను అవిశ్వాసులు ఆయన్ను చిత్రహింసలు పెట్టి మరీ చంపారు. దారుణంగా హింసిస్తూ ప్రాణం పోవడానికి కొన్ని ఘడియల ముందు ‘నీ చివరి కోరిక ఏమిట?’ గుండెల్లో గునపం దింపి అడిగారు. అందుకు ఆయన తట పటాయించకుండా ‘రెండు రకాతుల నమాజు చేసుకోవాలన్నది నా చివరి ఆకాంక్ష’ అని సమాధానమిచ్చారు. వారి నుండి లభించిన అను మతితో రెండు రకాతులు పూర్తి చేసి ఇలా అన్నారు: ”ఇది నా జీవితపు అంతిమ ఆరాధన గనక సుదీర్ఘంగా చేయాలన్న అభిలాష ఎంతో ఉన్నా, ‘చావు భయంతో నమాజుని సుదీర్ఘం చేసి చదువుతున్నాడు’ అన్న అపవాదు అవిశ్వాసల తరఫున రాకూడదని నేను నా ప్రార్థనను సంక్షిప్తంగా చేసి ముగించాను”.
    ప్రియ మిత్రుల్లారా! యాతనలతో కూడిన, చిత్రహింసలతో కూడిన చావు అందరికి రాకపోవచ్చు. కానీ, అందరూ చావడం మాత్రం ఖాయం. ఒకవేళ మనకే మరణ ఘడియలు దాపురించి ‘నీ చివరి కోరిక ఏమిట?’ అని ఎవరయినా మనల్ని అడిగినా, అడగకపోయినా మన చివరి కోరికి ఏమై ఉంటుందో? ఏమై ఉండాలో? మనలోని ప్రతి ఒక్కరు ఆత్మ సమీక్ష చేసుకోవాలి. అమ్మానాన్నలను చూడాలనుకుం టామా? భార్యాపిల్లలతో గడపాలనుకుంటామా? మన అభిమాన వ్యక్తి తో భేటి అవ్వాలనుకుంటామా? ఏదైనా ఆట ఆడాలనుకుంటామా? ఆస్తిపాస్తులను మరొక్కమారు లెక్కబెట్టుకోవాలనుకుంటామా? మిగిలి ఉన్న ఆ కొద్ది ఘడియల్ని సయితం సినిమాలు, సిత్రాలు అంటూ వృధా చేస్తామా?  లేదా ‘నన్నొదలండి, రెండు రకాతుల నమాజు చేసుకోవా లన్నది నా చివరి ఆకాంక్ష’ అని అల్లాహ్‌ా పట్ల మనకున్న అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తామా?
    అయినా అంత పునీతమయిన మాట మన నోట వెలువడాలంటే, నమాజు మధురానుభూతి తాలూకు పూర్వానుభవం మనకుంటేనే కదా? జీవితంలో ఒకట్రెండు మార్లు తోచినప్పుడు, తోచిన విధంగా వారానికో, మాసానికో, సంవత్సరానికో ఒక సారి నమాజు చేసే వారికి నమాజు మహిమ ఎలా తెలుస్తుంది? చెప్పండి. ‘ఒక నమాజు మరో నమాజుకి మధ్య జరిగే పాపాలను ప్రక్షాళిస్తుంది’ అన్నారు ప్రవక్త (స). అసలు నమాజే చదవని వ్యక్తి తన పాపాల్ని ఏం చేెస్తాడు?  అతని పాప ప్రక్షాళనామార్గం ఏమిటి? అతను పాప ఊబి నుండి విముక్తి పొందే దారేది?
    ప్రియ మిత్రుల్లారా! రోజుకి పది సార్లు ‘హయ్యా అలస్స్వలాహ్‌ – నమాజు వైపునకు రండి!’ అని, 10 సార్లు ‘హయ్యా అలల్‌ ఫలాహ్‌ా- సాఫల్యం వైపునకు రండి!’ అని అయిదు పూటల నమాజు కోసం ఇచ్చే అజాన్‌ రూపంలో స్వయంగా అల్లాహ్‌ా మనల్ని పిలుపునిస్తున్నాడు. అయినా మనం ఆయన ఆప్త పిలుపుకి స్పందించడం లేదు. ‘నేను హాజరయ్యాను స్వామీ’ అని జవాబు పలకడం లేదు. ‘కర్మకు తగ్గ ఫలం’ అన్నట్టు అల్లాహ్‌ా ఆప్త పిలుపు పట్ల ఇలా అమర్యాదగా వ్యవహ రించిన వ్యక్తిని అల్లాహ్‌ా అభిమానించి సత్కరిస్తాడని, సన్మానిస్తాడని ఎలా భావించగలం? చెప్పండి. నిజమయిన కీర్తి ఎవరికి వారుగా ఇచ్చుకునేది, ఒకరిస్తే పుచ్చుకునేది కాదు. అల్లాహ్‌ా అనుగ్రహించినది మాత్రే నిజమైన కీర్తి, వాస్తవ గౌరవం. ‘దాసుడు అత్యంత సమీపంగా దైవానికి సజ్దా స్థితిలో ఉంటాడు’ అని ప్రవక్త (స) వారు అన్నారు. మరే వ్యక్తయితే జీవితంలో ఒక్కసారి కూడా అల్లాహ్‌ా సన్నిధిలో పూర్ణ హృద యంతో, పూర్ణ బలంతో, పూర్ణ విశ్వాసంతో ఒక్క సజ్దా కూడా చేసి ఎరుగడో అతని వదనం దేదీప్యమానం ఎలా అవుతుంది. అతని జీవి తం నిండు కళను ఎలా సంతరించుకుంటుంది?అతనికి కీర్తి ఎలా ఒన
    గూడుతుంది?అతనికి  రేపు తీర్పు దినాన పుల్‌సిఇరాత్‌ వారధి దాటేం దుకు కావాల్సిన జ్యోతి ఎలా ప్రాప్తిస్తుంది? శరీరానికే తలమానికం అయిన శిరస్సును ఆ సర్వలోక పాలనాధీశుని సన్నిధానంలో వంచి నప్పుడే దానికి సిసలైన గౌరవం అసలయిన కీర్తి అని ఎరుగని వ్యక్తి ఎలా సంస్కారంతుడు అనిపించుకుంటాడు? చేసిన అర్థ రూపాయి సహాయానికి కృతజ్ఞత కోరుకునే మనిషి అల్లాహ్‌ ప్రసాదించి అనన్య అనుగ్రహాల్ని అనుభవిస్తూ, అగణ్య వరాలను పొంది కూడా అల్లాహ్‌ పట్ల పూర్తి అణుకువ కూడిన ఒక సజ్దా చేయకపోవడం ఎంత దుర దృష్టకరం!  దాసుడు దైవ సన్నిధికిలో నిలబడి అల్లాహ్‌ను స్మరించ డమే ఆలస్యం ‘నేనున్నాను’ అంటూ బదులిస్తాడు. అట్టి దయాసాగరు ని సన్నిధికి వెళ్ళనివాడు ఎంత దరిద్రుడో ఆలోచించండి.
    ప్రియ మిత్రుల్లారా! నమాజు ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. అల్లాహ్‌ా ఆదేశం.అల్లాహ్‌ పంపగ వచ్చిన ప్రవక్తలందరూ ఎంతో ఇష్టం గా పాటించిన సంప్రదాయం. మానవుల్లోనే శ్రేష్టులయిన ప్రవక్తలు భక్త్తిప్రపత్తులతో నమాజు చేయడం, సామాన్య వ్యక్తులయిన మనం చేయకపోవడం దేన్ని సూచిస్తుందో యోచించండి! ఇది మనలో దుర హంకార వైఖరికి నిదర్శనం కాదా? లేదా ‘దురంహాకర దురంధురుల వైపు అల్లాహ్‌ కన్నెత్తి కూడా చూడడు’ అని ప్రవక్త (స) చేసిన హెచ్చ రిక మన చెవిన పడలేదా?
    కొందరు సంపద లేమితో సతమతమవుతూ ఉండొచ్చు. కొందరు సంతాన లేమితో బాధ పడుతూ ఉండొచ్చు. కొందరు సంతాప సము ద్రంలో మునిగి ఉండొచ్చు. అన్ని రోగాలకు, అన్ని బాధలకు, అన్ని సమస్యలకు పరిష్కారం నమాజు. నమాజు చదివి ప్రవక్త జకరియ్యా (అ) పొందిన శుభవార్తను మనమూ పొందాలి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”కుటీరంలో నిలబడి (జకరియ్యా -అ)నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి, ‘అల్లాహ్‌ నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతను అల్లాహ్‌ వాక్కును ధృవ పరుస్తాడు.  నాయకుడవుతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు, దైవప్రవక్త, దైవ వర్తనులకోవకు చెందినవాడై ఉంటాడు” అని చెప్పారు.   (ఆలి ఇమ్రాన్‌: 39)
    ప్రజలు నమాజు చేసుకుంటున్నారు.నమాజు చెయ్యకుండా ఓ మూల నిలబడి ఉన్న వ్యక్తినుద్దేశించి ”ఏమిటి? నువ్వు ముస్లింవి కాదా?”అని ఆరా తీశారు ప్రవక్త (స). రేపు ప్రళయదినాన నమాజు   పట్ల   మన నిర్లక్ష్యాన్ని చూసి ‘ఏమిటి మీరు ముస్లింలు కారా?’ అని ప్రవక్త (స) మనల్ని నిలదీయడం మనకు ఇష్టమేనా?
    నమాజు సలిపే ప్రతి వ్యక్తి ముఖారవిందంలో ప్రార్థనా తాలూకు తేజస్సు తొణికిసలాడుతూ ఉంటుంది. ప్రజల నుదుళ్ళపై కనబడే నల్లని మచ్చ కాదు.. అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో పేర్కొన్న ఛాయ. నల్ల ఛాయో, తెల్ల ఛాయో, పశుపు పచ్చని ఛాయో, ఏర్ర ఛాయో కాదు; అది అక్షరాల నమాజు ఛాయ. ”అల్లాహ్‌ కృపను, ఆయన ప్రసన్న తను చూరగొనే ప్రయత్నంలో వారు వినమ్రులయి రుకూ చేయ డాన్ని, సజ్దా చేయడాన్ని నీవు చూస్తావు. వారి సజ్దా ప్రత్యేక ప్రభా వం వారి ముఖార ందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది.”  (అల్‌ పతహ్‌: 29)
    అల్లాహ్‌ాకు మిక్కిలి ప్రియమయిన నమాజు ఛాయను నోచుకో కుండా పోయిన వ్యక్తి ఎంత మేలిమిచ్ఛాయ కలిగి ఉన్నా అంతిమం గా నరకాగ్నిలో కాలి నల్లబడాల్సిందే! నరకవాసుల గురించి తెలియ జేస్తూ అల్లాహ్‌ా ఇలా అంటున్నాడు: ”వాడు సత్యాన్ని ధృవీకరించనూ లేదు. నమాజు చదవనూ లేదు. పైగా వాడు ధిక్కరించాడు. వెను తిరిగి పోయాడు. మిడిసి పడుతూ తన ఇంటి వారల వైపు వెళ్ళి పోయాడు. శోచనీయనం! నీ వైఖరి కడు శోచనీయం!! మరీ విచార కరం! నీ ధోరణి మిక్కిలి విచారకరం!!” (ఖియామా:31-35)
    ”ఆ రోజు (స్వర్గవాసులు నరకవాసుల్ని ఉద్దేశించి) ఇంతకీ ఏ విష యం మిమ్మల్ని నరకానికి తీసుకొచ్చింది? అని అడుగుతారు. వారి లా సమాధానం ఇస్తారు. ‘మేము నమాజు చేసేవారము కాము. నిరుపేదలకు అన్నం పెట్టే వారమూ కాము. పైగా మేము పిడి వాదన చేసేవారితో చేరి వాదోపవాదాలలో మునిగి ఉండేవారము. ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళము. తుదకు మాకు మరణం వచ్చేసింది”. (దహ్ర్‌ా: 43-47)
    మరి మనం నరకవాసుల్లోనే ఉండిపోదామా? స్వర్గవాసుల స్థాయి ని అందుకునే అవిరళ కృషికి పూనుకుందామా? మరి స్వర్గవాసులు ఎవరంటారా? అదీ ఆ కృపాసాగరుని మాటల్లోని వినండి – ”వారు అగోచరాలను విశ్వసిస్తారు. నమాజును స్థాపిస్తారు”. (బఖరా:2)
    అల్లాహ్‌ కృప వల్ల మనం విశ్వాసులం; మంచిదే. కానీ, నమాజు చదవడం లేదు ఎందుకు?
    తమ తమ ఇళ్ళకు వెళ్ళాలనుకున్న యువకుల్ని ఉద్దేశించి ప్రవక్త (స) వారు చేసిన ప్రధమ హితవు ఏమిటో తెలుసా? ”నమాజు స్థాపించండి” అన్నది. నమాజు చదివే వ్యక్తి అల్లాహ్‌ాకు అత్యంత సమీపంగా ఉంటే, చదవని వ్యక్తి అందరికన్నా దూరంగా ఉంటాడు. అమ్మనాన్న, అక్కాచెల్లెల్లు, అన్నాదమ్ముళ్లు, ఆప్తులు స్నేహితులు – ఇలా ఎవరితోనయినా దూరంగా ఉండి బ్రతకొచ్చు కానీ, అల్లాహ్‌ా కు, ఆయన కృపాకటాక్షాలకు దూరంగా ఉండి ఎవరు బ్రతికి బట్ట కట్టగలరు చెప్పండి! ఏమిటి, ”ఆ తర్వాత కొందరు అయోగ్యులు వచ్చి నమాజులను వృధా చేశారు. మనోవాంఛలకు బానిసలయి బ్రతికారు” (మర్యమ్‌; 59) అని స్వయంగా అల్లాహ్‌ాయో ‘అయో గ్యులు’ అన్న వారి జాబితాలో చేరడం మనకిష్టమేనా.? ‘బే నమాజీ’ అని అందరూ ఎద్దేవ చెయడం మన నచ్చుతుందా?
    మనం  ఎంత అంగ బలం, అర్థ బలం, అధికార బలమయినా కలిగి ఉండొచ్చు. అందం రీత్యా మనం విశ్వ సుందరులే కావచ్చు. కానీ, మనం నమాజును వేళకు చేయకపోతే అల్లాహ్‌ దగ్గర మాత్రం కటిక దరిద్రులం, అందవిహీనులం, అజ్ఞానులం, దుష్టులం, దుర్మార్గు లమే. ఇది మనకు సమ్మతమేనా?
    ప్రియ మిత్రుల్లారా! అల్‌హమ్దులిల్లాహ్‌ా మనం రోజుకి అయిదు సార్లు అజాన్‌ వింటున్నాము. ఖుర్‌ఆన్ను దైవగ్రంథంగా విశ్వసిస్తున్నాము. ఖుర్‌ఆన్‌లో నమాజును స్థాపించండి అన్న ఆదేశం అనేెక సార్లు వచ్చిం దన్నదీ మనకు ఎరుకే. ఖుర్‌ఆన్‌ అల్లాహ్‌ా ప్రోక్తం అని బలంగా విశ్వ సించే మనలో రోజుకు ఆయిదు సార్లు నమాజు పిలుపు విని కూడా స్పందన కనబడటం లేదంటే ఏమిటి అర్థం? గుండె అని గుడిలో దైవ భీతి ఉన్నాట్టా? లేదా ఐహిక లాలస, కాంక్షల దాస్యం గూడు కట్టుకు న్నట్టా? ”ఏమిటి. విశ్వాసుల హృదయాలు అల్లాహ్‌ా సంస్మరణ పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మొత్తబడే సమయం ఇంకా ఆసన్నం కాలేదా?” (హదీద్‌: 16)
    చూడండి! మనం ఒక కార్యాలయంలోనో, ఒక పాఠశాలలోనో పని చేస్తున్నామనుకోండి.ఆ కార్యాలయం, ఆ పాఠశాల కేటాయించిన సమ యానికి బద్దులయి మసలుకోమా?ఉద్యోగ విషయంలో, వ్యాపార విష యంలో, వివాహ విషయంలో, జీవిత ఇతర విషయాల్లో ఖచ్చితంగా సమయపాలనను పాటించే మనం-”నిశ్వయంగా నమాజును నిర్థారిత వేళల్లో చేయడం విశ్వాసులకు విధిగా చేయబడిది”. (నిసా:103) అని స్వయంగా ఆ సర్వేశ్వరుడే సెలవిస్తుంటే ఆ మాత్రం నీతిని నమాజు విషయంలో పాటించలేకపోతున్నాము. పనీ చేయక, కష్టా పడక అదృ ష్టం వరించాలనుకోవడం, యజమాని నుండి వెతనాన్ని, ఫలితాన్ని కోరుకోవడం దురాశే కదా! మరి దురాశేమో దుఃఖానికి చేటాయో!
    ప్రియ మిత్రుల్లారా! సాధారణ దినాల్లోనే కాదు, సంబర ఘడియల్లో సయితం ‘మేము మా ఈ పండుగ రోజుని నమాజుతో ప్రారంభి స్తాము’ అని ప్రవక్త (స) వారు చెబుతుంటే, మనం మన దైనందిన జీవితాన్ని నమాజుతో ప్రారంభించకపోవడం శుభమా? అశుభమా? ఆలోచించండి! మనం శ్వాస పీల్చుకుంటున్న దినం పండుగ దినమే కావచ్చు. షడ్రుచులు మేళవించిన వంటకాలే మనం ఆరగించి ఉం డొచ్చు. నూతన వస్త్రాలు ధరించి మనం నవాబుల్లానే నడుస్తుండొచ్చు, అమ్మనాన్నలు, బంధుమిత్రులు, ఇరుగపొరుగు వారితో యమ జోరు గా వెళ్ళి పలుకరించే ఉండొచ్చు; కానీవీటన్నింటిని మనకు అనుగ్ర  హించిన ఆ నిజ స్వామి సన్నిధానానికి మనం హాజరు కాలేదంటే మనం అనుకుంటున్న ఈ పండగ కూడా  పనికిమాలిందే. ఒక్క మాటలో చెప్పాలంటే, అల్లాహ్‌ా విధేయతలో గడిపిన ప్రతి దినం పండగే. అది లేని ప్రతి క్షణం దండగే.
    ప్రవక్త (స) వారి సహచరుల్లో ఎవరి వల్లయినా ఒక నమాజు తప్పి పోతే ‘తన మొత్తం కుటుంబాన్ని పోగుట్టుకున్నట్లు’ వారు ఫీలయ్యే వారు. అవును, ప్రార్థనా ప్రాశస్త్యం వారికి తెలిసినంతగా ఎవరికి తెలి యదు. ఒక్క పూట నమాజు తప్పితేనే వారు అంతగా విలవిల్లాడి పోతున్నారే, మరి మనమేమో రోజులు, వారాలు, నెలలు, ఏండ్ల తర బడి నమాజులను వదులుతూ కూడా చలించడం లేదంటే, మన నుదు ళ్ళపై మడతలు పడటం లేదంటే, మనకు బాధ కలగటం లేదంటే మనలో విశ్వాసం ఉన్నాట్టా, లేనట్టా? ‘నా కంటి చలువ నమాజులో ఉంచ బడింది’ అని స్వయంగా ప్రవక్త (స) వారు సెలువిస్తున్నారు. అంతిమ దినాల్లో నడవలేని స్థితిలో ఇద్దరి సహాయమ కాళిఓలడ్చుకు ంటూ వచ్చి సామూహిక నమాజులో పాల్గొంటున్నారు. మరి మన మేమో ‘సినిమాలు, సిత్రాలు, వ్యర్థ కార్యక్రమాల్ని చూసి మన కళ్లను చల్లార్చుకోవాలనుకుంటున్నామే దీన్నేమనాలి? ”నమాజు స్థాపించే వారిని ప్రశంసాత్మక స్థానం మీద ప్రతిష్టింప జేస్తాను” అని అల్లాహ్‌ా మాటిస్తుంటే, మనమేమో అపకీర్తి అడుసులోనే అట్టడుగున పడి ఉండ టాన్నే ఇష్టపడుతున్నామే, దీన్నేమంటారు?
    ”అల్లాహ్‌ వారి ఇళ్ళను నిప్పుతో నింపుగాక! వారు మమ్మల్ని అస్ర్‌ నమాజు చేయకుండా చేశారు” అని కందక యుద్ద సమయంలో ప్రవక్త (స) వారు అవిశ్వాసుల్ని అభిశపించారు అంటే ఆలోచించండి, నమాజు ఎంత ఘనతరమయిన ప్రార్థనో! ఆ రోజు యుద్ధ కారణంగా అనేక దైనందిన కార్యాలు వాయిదా పడ్డాయి. ప్రవక్త (స) వాటిని ఖాతరు చేయలేదు. నమాజునే ప్రత్యేకంగా పేర్కొన్నారంటే, సదా దీవె నల్ని కురిపించే ఆయన అధరాలు అభిశపించాయి అంటే, నమాజును వదలడంగానీ, నమాజును చేయకుండా ఆపడంగానీ ఎంత భయంకర నేరమో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇస్లాంలోని ప్రతి ఆదేశం గురించి సమయం సందర్భాన్ని బట్టి మినహాయింపు ఉంది. కానీ, శ్వాస, స్పృహ ఉన్నంత వరకు ఎటువంటి మినహాయింపు లేని ఆదే శం ఒక్క నమాజు విషయంలోనే ఇవ్వబడింది. చివరికి భీకర పోరు జరుగుతున్నా నమాజును వాయిదా వేయడానికి లేదు అంటూ ఆ స్థితిలో చేసే నమాజు విధానాన్ని ప్రత్యేకంగా అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌లో పేర్కొన్నాడంటే, అల్‌హమ్దులిల్లాహ్‌ ప్రశాంత వాతావరణంలో నివ సిస్తున్న మనపై నమాజు తాలూకు బాధ్యత ఏపాటిదై ఉంటుందో యోచించాలి. కొత్తగా ఇస్లాం స్వీకరించిన తాయిఫ్‌ ప్రజలు కొన్ని విషయాలలో మినహాయించపు కోరితే మినహాయింపును ప్రకటించిన ప్రవక్త (స), నమాజు విషయంలో కూడా మినహాయింపునివ్వండి అని విన్నవించుకున్నప్పుడు ‘నమాజు లేని మతధర్మంలో శుభమే మిగు లుండదు’ అని చెప్పారంటే నమాజుకు నోచుకోని మన జీవితం ఎలాంటిదో యోచించండి!
    అల్లామా జహబీ (ర) మరణిస్తూ అన్న మాట:”ఏ ఒక్క విధి నమాజు  వదలని శుభ దినంలో నాకు మరణాన్ని ప్రసాదించినందుకు నేను అల్లాహ్‌ాకు వేనవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను’ అన్నా రంటే, అంతిమ దైవప్రవక్త (స) అంతిమ ఘడియల్లో అనేక సార్లు స్పృహ తప్పినా స్పృహ వచ్చిన ప్రతి సారి నమాజు చేయడానికి ప్రయ త్నించేవారంటే, తన గది తెరను తొలగించి నమాజు చేస్తున్న సహచరుల్ని చూసి చల్లని చిరినవ్త్వుకటి ఆయన ఆధరాలపై కదలాడిం దంటే, అంతిమ శ్వాస అగుతున్న సమయంలో సయితం ‘నమాజ, నమాజు…మీ అధీనంలో ఉన్న వారి యెడల ఉత్తమంగా వ్యవహరిం చండి’ అని తాకీదు చేెశారంటే నమాజు ఎంత మహిమాన్వితమయిన ఆరాధనో ఆలోచించండి! ప్రవక్తల, పుణ్యాతుల, సత్పురుషుల, షహీ దుల, ఔలియాల, హదీసువేత్తల  దృష్టిలో అంతటి ఘనపాటి అయిన నమాజు మన దృష్టిలో ఎటువంటి విలువ లేనిదిగా ఉందంటే లోపం ఎవరిదో, ఎవరిలో ఉందో ఎవరి వారే ఆత్మ సమీక్ష  చేసుకోవాలి.

    సభ్యతా సంస్కారాల సరోవరం నమాజు


    నమాజు చేసే ప్రతి వ్యక్తీ శుచీ, శుభ్రతలను పాటించటం అవశ్యం. ఇస్లాం తొలి ఆజ్ఞలలో తహారత్‌ ఒకటి. దైవప్రవక్త ముహమ్మద్‌ (స)పై రెండవసారి అవతరించిన దివ్యవాణి శుచీశుభ్రల (తహారత్‌) కు సంబంధించినదే. ఉదాహరణకు:- ”నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. అశుద్ధతను వదలిపెట్టు”. (అల్‌ ముద్దస్సిర్‌ – 4,5)
    అందుకే ఇస్లాం పరిశుభ్రత, పరిశుద్ధతలకు సంబంధించిన సూత్రాలను నిర్థారించింది. దైవప్రవక్త (స) తన బోధనల ద్వారా దాని సరిహద్దులను ఖరారు చేశారు. నమాజు సజావుగా నెరవేరాలంటే మనిషి శరీరం, అతను తొడిగే దుస్తులతోపాటు అతను నమాజు చేసే స్థలం కూడా పరిశుభ్రంగా ఉండాలి – ఎలాంటి మలినం ఉండకూడదు. ఒకప్పుడు అరబ్బులు కూడా ఇతర అనాగరిక జాతుల మాదిరిగా శుచీశుభ్రతలను బొత్తిగా పాటించేవారు కాదు. ఉదాహరణకు ఒక పల్లెటూరి బైతు సాక్షాత్తూ మస్జిదె నబవీలోనే – అందరి సమక్షంలో – మూత్రం పోసేశాడు. సహచరులు (ర) అతన్ని కొట్టేందుకు ఎగబడ్డారు. దైవప్రవక్త (స) వారందరినీ వారించారు. ”నాయనా! ఇది ప్రార్థన చేసే స్థలం. ఇలాంటి చోట మల మూత్ర విసర్జన చేయకూడద”ని ఎంతో నిదానంగా నచ్చచెప్పారు. ఆ వ్యక్తి మూత్రం పోసిన చోట నీళ్లు కుమ్మరించమని ప్రియసహచరుల్ని పురమాయించారు.
    ఒకసారి ఆయన (స) ఒక సమాధి దగ్గరి నుంచి సాగిపోతూ, ”ఈ సమాధిలోని వ్యక్తి యాతనకు గురవుతున్నాడు. ఇంతకీ ఈ వ్యక్తి (వల్ల జరిగిన అశ్రద్ధ ఏమిటంటే) మూత్రపు తుంపరలు తన శరీరంపై పడుతున్నా లక్ష్యపెట్టేవాడు కాదు” అన్నారు. ఈ విధంగా ముస్లింలు శుచీశుభ్రతల విషయంలో కడు జాగ్రత్తగా ఉండాలని నొక్కి వక్కాణించబడింది. కాలకృత్యాలు తీర్చుకునే విషయంలోనూ, వుజూ గుసుల్‌ విషయంలోనూ గొప్ప నాగరీక జాతులు సయితం పాటించని మర్యాదలు ముస్లింలకు బోధించ బడ్డాయి.
    తమ శరీరాన్ని, దుస్తులను, నివాస గృహాలను అన్ని రకాల మలినాల నుండి కాపాడుకుంటూ షరీయతు బద్ధంగా తహారత్‌ పాటించే ప్రవక్త శిష్యులను అల్లాహ్‌ ఈ విధంగా కొనియాడాడు:
    ”ఈ మస్జిద్‌లో ఉండే వారిలో కొందరు బాగా పరిశుద్ధతను పాటించటాన్ని ఇష్టపడతారు. అల్లాహ్‌కు పరిశుద్ధతను పాటించే వారంటే ఎంతో ఇష్టం”. (దివ్యఖుర్‌ఆన్‌ – 9:108)
    దేవుని ప్రేమాభిమానానికి పరిశుభ్రత (తహారత్‌) ఒక ప్రధాన కారణమైనప్పుడు ఈ భాగ్యానికి ఎవరయినా ఎలా దూరంగా ఉండగలుగుతారు??
    నమాజు వల్ల కలిగే ఇంకొక ప్రయోజనమేమిటంటే, అది మనిషిని అనుదినం నీటుగా ఉండేలా చేస్తుంది. అతడు నిత్యం తన ఒంటిని, దుస్తులను శుభ్రంగా ఉంచుకుంటాడు. నమాజు చేసే వ్యక్తి రోజుకు ఐదు సార్లు తన ముఖాన్ని, కాళ్ళుచేతులను నియమబద్ధంగా కడుక్కుంటాడు. ముక్కులో సయితం నీళ్ళు జొన్పి నాసిక పుటాలను శుభ్రపరుస్తాడు. దీనివల్ల వైద్య పరంగా కలిగే లాభాలు ఎన్నో. ముక్కు పుటాల మార్గంగ ుండా శరీరం లోపలికి వెళ్ళే సూక్ష్మక్రిములు ఈ ‘వుజూ’ ద్వారా దూరమవుతాయి. ముక్కులో సయితం నీరు పోసి శుభ్రపరచే శిక్షణ బహుశా ఇస్లాం ఒక్కటే ఇచ్చింది. ప్రపంచంలో మరే మతం కూడా ఈ శిక్షణ ఇవ్వదు. దీన్నిబట్టి ఇస్లాం ఆదేశాలు వైద్యశాస్త్రం దృష్ట్యా కూడా ఎంతో మేలైనవే. ఒకప్పుడు నీరు అతి తక్కువ మోతాదులో లభ్యమయ్యే అరబ్బు ప్రదేశంలో రోజుకు ఐదు సార్లు ‘వుజూ’ చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పటం ఇస్లాంకే చెల్లింది.
    అరబ్బులు – ముఖ్యంగా పల్లెటూళ్లలోని వారు – పల్లు తోము కోవడం పట్ల మరీ సోమరితనం ప్రదర్శించేవారు. తత్కారణంగా నోట్లో నుంచి దుర్వాసన రావటమేగాకుండా, రకరకాల దంత వ్యాధులు కూడా సోకేవి. మహా ప్రవక్త (స) ప్రతి నమాజు సందర్భంగా ‘మిస్వాక్‌’ (దంత ధావనం) చేయాలని తాకీదు చేశారు. ”ఒకవేళ నా అనుచర సమాజం ఇబ్బందికి గురవ దనుకుంటే మిస్వాక్‌ చేయటాన్ని అవశ్యంగా ఖరారు చేెసి ఉండేవాణ్ణి” అని ఆయన (స) చెప్పటం గమనార్హం.
    అలాగే వీలునుబట్టి స్నానం చేస్తూ ఉండాలి. స్నానం చేశాక పొడి దుస్తులు ధరించటం, సుగంధ ద్రవ్యాలు పూసుకోవటం మంచిది. ముఖ్యంగా శుక్రవారం (జుమా) నమాజుకైతే స్నానం చేసి మరీ రావాలి.

    17, జూన్ 2014, మంగళవారం

    చీకటి నుండి వెలుగు వరకు


    అరబ్బులందరిని క్రైస్తవులుగా మార్చాలనుకున్న సదరన్‌ బాప్టిస్ట్‌ యువతి, ఒక కంప్యూటర్‌ మిస్టిక్‌ వలన సత్య ధర్మంలోకి అడుగిడి, 32 సంవత్సరాలుగా అమెరికాలోని క్రైస్తవులను ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తున్న ఈమె 1975లో అస మాన సామర్థ్యమున్న బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్ట్‌. అవార్డులను గెలుచుకుంటూ, సొంత వ్యాపారాన్ని చూసుకునే ఈమె జీవితం ఓ విచిత్రమైన మలుపు తిరిగింది.
    ”నేను ముస్లింనని చెప్పుకోవడానికి సంతోష పడుతున్నాను. ఇస్లాం నా జీవితం. ఇస్లాం నా గుండె చప్పుడు. ఇస్లాం నా రక్త నాళాలలో ప్రవహించే రక్తం. ఇస్లాం నా బలం. ఇస్లాం నా అద్భుతమైన, అందమైన జీవితం. ఇస్లాం లేకుండా నేను లేను. అల్లాహ్‌ా తన చూపుని నా వైపు నుండి త్రిప్పితే నేను బ్రతకలేను.” అని చెప్పిన ఈ సోదరి ఇస్లాం కోసం ఎన్నో త్యాగాలను అల్లాహ్‌ాపై విశ్వాసంతో సునా యాసంగా చేసి, 16సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలను ఎదుర్కొని, చివరకు తన జీవితంలో కోల్పోయినదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ యిన దానిని సాధించి తోటి ముస్లింలకు ఆదర్శమయిన  సోదరి అమీన అస్సిల్మి యొక్క జీవిత కథను ఈ నెల అందిస్తున్నాం.
    ఆమినా మొదటిసారి ముస్లిములను కలసిన ప్పుడు, రిక్రియేషన్‌లో ఆమె డిగ్రీ పూర్తి కావ స్తుంది. డిగ్రీ మొదటి సంవత్సరంలోనే తీసుకు బోయే కోర్సు గురించి ముందుగానే రిజిష్టర్‌ చేసుకోవచ్చు. ఆ విధంగా రిజిష్టర్‌ చేసుకుని తన పనులు చూసుకోవడానికని ఓక్లహామా వెళ్ళారు. ఆ వ్యవహారాలు పూర్తి కావడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్ట డం వలన, స్కూలుకి ఆలస్యంగా రావడం జరి గింది. ఇక ఇప్పుడు ఏదైనా ఓ కోర్సుని డ్రాప్‌ చేసుకోవడానికి అవకాశం లేదు.  మిస్సయిన వర్క్‌ని అందుకోవడంలో ఆమెకి కంగారుపడ వలసిన అవసరం లేదు. క్లాసులో, తన సబ్జెక్ట్‌ లో  టాప్‌ ర్యాంక్‌లో ఉంటూ, ప్రొఫెషనల్స్‌తో కూడా పోటీ పడీ చాలా అవార్డులు గెలుచుకు న్నారు. ఇంత ప్రతిభ ఉన్నప్పటికీ, ఆమెకున్న అమితమై సిగ్గుబిడియాల కారణంగా ఇతరుల తో చాలా తక్కువుగా మాట్లాడేవారు. ఎవరితో నైనా మాట్లాడటం చాలా అరుదు.  బాగా అవ   సరమైతేనే మాట్లాడేవారు లేదా తెలిసినవారి తోనే మాట్లాడటానికే ఇష్టపడేవారు. ఆమె తీసుకునే క్లాసులు ఎడ్మినిస్ట్రేషన్‌,సిటీ ప్లానింగ్‌, పిల్లల ప్రోగ్రామింగ్‌ మొ:వి. కాని ఆమె ఎక్కువగా హాయి పొందేది పిల్లలతోనే. సరే, కథలోకి వెనెక్కి వెళితే…..
    కంప్యూటర్‌ ప్రింటవుట్‌ ఆమెకో షాక్‌ ఇచ్చింది. ఇంతకి తాను రిజిస్టర్‌ చేసుకున్నది ఓ థియేటర్‌ క్లాస్‌ (అంటే పొరపాటున, థియేటర్‌ క్లాసుగా రిజిస్టర్‌ అయ్యింది.) థియే టర్‌ క్లాసంటే ప్రత్యక్షంగా, మనుషుల ఎదురు గా ప్రదర్శించవలసి ఉంటుంది. క్లాసులో ఓ ప్రశ్నను సహితం అడగలేని ఆమె, ప్రజలెదు రుగా స్టేజి మీదికెళ్ళడానికి భయపడింది.
    ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆమె భర్త, ఆమె సమస్యను క్లాస్‌ టీచర్‌కు వివరించమని సలహా ఇచ్చారు. ఈ విషయం నుండి ఆమెను బయటపడేలా చేయడానికి టీచర్‌ ప్రయత్ని స్తానని భరోసా ఇచ్చింది. కాబట్టి క్లాసుకు వెళ్ళారు. అయితే ఆమెకి రెండవ షాక్‌ ఏమిటంటే, క్లాసు పూర్తిగా అరబ్బులతో నిండి ఉండటమే. ఎప్పుడు అరబ్బులను ప్రత్యక్షంగా చూడని ఆమెకు క్లాసులో ఓ సమూహమే కని పించే సరికి,వారిపై తనకుండే ద్వేషం దురభి ప్రాయల వలన, క్లాసులో కూర్చోకుండా ఇంటి కి వెళ్ళి పోయింది.  ఆమె చెప్పారు ”ఈ సందర్భంలో మీరు ఓ విషయాన్ని తెలుసుకోవాలి. నేను లెదర్‌ హట్‌ ఫ్యాంట్‌ తీసుకుని, పై భాగాన తాళ్లతో కట్టుకునే టాప్‌ను ధరించి, చేతులలో  మందు గ్లాసుతో ఉన్న నా లాంటి మహిళకు (నా మనస్సుకు నాకంటే ఆ) అరబ్బులే చెడ్డవారిగా అనిపించారు.”
    ఇక క్లాసుకు మళ్ళి వెళ్ళే ప్రసక్తి లేదని ఆమె తన భర్తతో చెప్పినప్పుడు, ఆయన తన సహజ ప్రశాంత ధోరణిలోనే స్పందించారు. ప్రతీ దానికి దైవం ఏదో ఓ కారణాన్ని ఉంచుతారనే విషయాన్ని భర్తకు ఎప్పుడూ ఈమె చెబుతూ ఉండేది. ఆ విషయాన్నే ఆమెకు గుర్తు చేసి, చివరి నిర్ణయం తిసుకునే ముందు, కొంత సమయం తీసుకుని, బాగా ఆలోచించుకోమని చెప్పారు. అంతే కాకుండా ఆమెకున్న స్కాలర్‌ అవార్డు వలన ట్యూషన్‌ ఫీజు కట్టవలసిన అవసరం లేదు. అది నిలబెట్టుకోవాలంటే క్లాసుకెళ్ళడం తప్పదు మరి.
    ఆ తరువాత రెండు రోజులు ఏదైనా మార్గం చూపించమని దైవాన్ని ప్రార్థించింది. నరకాగ్ని నుండి ఈ బుద్ధిహీనుల్ని (అప్పటి ఆమె ఉద్దే శంలో అరబ్బులని) రక్షించడానికే దైవం ఆమెను ఈ క్లాసులో ఉంచడం జరిగిందని, తనకు తానే సర్ధి చెప్పుకుని తిరిగి రెండు రోజు లకు క్లాసుకు వెళ్ళింది.
    క్లాసులో, జీసెస్‌ను వారి వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించకపోతే, వారు తమ పరలోక జీవి తమంతా నరకాగ్నిలోనే కాలుతుంటారని ఆమె వివరించి చెప్పినా సరే, వారు మాత్రం చాలా మర్యాద చూపారే గాని, క్రైస్తవాన్ని స్వీకరించ లేదు. తరువాత జీససెస్‌ వారిని ఎలా ప్రేమిం చాడో, వారి పాపాలనుండి కాపాడటానికి శిలు వపై ఎలా మరణించాడో వివరిస్తూ, వారు మనస్ఫూర్తిగా అంగీకరించాలని చెప్పినా, తిరిగి వారు మర్యాద చూపారే కాని ఇంకనూ క్రైస్తవాన్ని స్వీకరించలేదు. కాబట్టి వారి స్వంత గ్రంథాన్ని చదివి, దాని ద్వారానే ‘ఇస్లాం వాస్తవ ధర్మం’ కాదని మరియు ముహమ్మద్‌ (స) ‘వాస్తవ దైవం’ కాదని వారికి   నిరూపిం
    చాలనే నిర్ణయానికొచ్చింది. (క్రైస్తవులు,  ప్రవక్త ‘ఈసా’(అ)ను దైవంగా పూజిస్తారు కాబట్టి ముస్లిములు కూడా ముహమ్మద్‌ (స) వారిని దైవంగా పూజిస్తారని అప్పట్లో ఆమె భావించేవారు).
    విద్యార్థులలో ఒకతను ఆమెకు ఒక ఖుర్‌’ఆన్‌ ప్రతిని, ఇస్లాం గురించి తెలియజేసే మరో పుస్తకాన్ని ఇచ్చాడు. ఆమె పరిశోధనను మొదలు పెట్టారు. తనకవసరమైన ఆధారం చాలా తొందరగా దొరుకుతుందనే నమ్మకం తోనే, ఆమె ఖుర్‌’ఆన్‌ను, రెండవ పుస్తకంతో పాటుగా, 15 ఇతర పుస్తకాలను మరియు సహీ ముస్లిం హదీసులను చదివాక, మరలా ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని చదవడం ప్రారంభిం చారు. అయితే అరబ్బుల నందరినీ క్రైస్తవులు గా మార్చాలనే పట్టుదల మాత్రం ఆమెలో అలాగే ఉంది. ఆమె చదువు మరో సంవత్సర మున్నర కొనసాగింది.
    ఈ సమయంలో, ఆమెకు భర్తతో సమస్యలు మొదలయ్యాయి. ఇస్లాం అధ్యయనం వలన ఆమెకు తెలియకుండానే ఆమెలో వస్తున్న చిన్న మార్పే ఆయనని బాధించసాగింది. వారిద్దరూ ప్రతీ శుక్రవారం మరియు  శని వారం బార్‌కి లేదా పార్టీలకి వెళ్ళేవారు. అంతకు ముందరిలాగ బార్‌కి వెళ్ళే కోరిక ఇప్పుడు ఆమెలో లేదు. ఆమె చాలా నిరాడం బరంగా మారింది. ఆమెకు తెలియకుండానే, ఆయన మనస్సుకు దూరం అవుతూ వుంది. తన భార్యలో వస్తున్న మార్పుని అతను మరోలా ఆర్థం చేసుకుని, ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుందేమోనన్న అనుమానం తో, ఆమెను బయటికి వెళ్ళగొట్టాడు. పిల్లలతో పాటు ఓ అపార్ట్‌మెంట్‌లోకి మారింది. కాని ముస్లింలను క్రైస్తవులుగా మార్చాలనే కృషి, పట్టుదల ఆమెలో అలాగే ఉన్నాయి.
    ఆమె చెప్పిన వర్ణన ప్రకారం, ఒక రోజు తెల్లటి పొడవైన నైట్‌గౌన్‌ లాంటిది ధరించి, తలపై ఎరుపు, తెలుపు గడులున్న టేబుల్‌ క్లాత్‌ లాంటిది ధరించిన ఓ వ్యక్తి ఆమె తలుపు తట్టాడు. ఆయనతో పాటు మరో ముగ్గురు పైజమాలు ధరించిన వారున్నారు (వారి సాంప్రదాయ దుస్తుల్ని చూడటం ఆమెకి అదే మొదటిసారి). రాత్రి వేసుకునే దుస్తులు లాంటి బట్టలతో కనిపిస్తున్న మగ వాళ్ళని చూశాక, తనకి చాలా కోపం వచ్చింది. ‘నన్ను ఎలాంటి ఆడదాన్ననుకుం టున్నారు వీళ్ళు? వీరికి సభ్యతాసంస్కారం లేదా? అని లోపల అనుకుంటుండగా, ఆమె  షాక్‌ను అర్థం చేసుకున్న, టేబుల్‌ క్లాత్‌ను ధరించిన వ్యక్తే ముందుగా మాట్లాడాడు. ఆమె ముస్లిం కావాలని కోరుకుంటుందనే విషయం తనకు తెలిసిందని చెప్పాడు. తను ముస్లిం కావాలని కోరుకోవడం లేదని, తనొక క్రిస్టి యన్‌నని చెప్పారామె. అయినప్పటికిని, వారికి సమయముంటే, ఇస్లాంపై తను కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నట్లు కూడా తెలియ జేశారామె. అతని పేరు అబ్దుల్‌ అల్‌-షేఖ్‌. ఆమెతో చర్చించడానికి సిద్ధమన్నాడు. అతని లోని సహనాన్ని ఆమె గుర్తించింది. ప్రతీ ప్రశ్నను ఆమెతో చర్చించాడు. ఆమె ఎప్పుడూ మూర్ఖంగా ఫీలయ్యేలా గాని, ఆమె అడిగిన ప్రశ్న బుద్ధిహీనమైనదనిగాని ఎప్పుడూ చెప్పలేదు. ‘ఆరాధ్యుడు ఒక్కడే’ అని నమ్ముతు న్నావా? అని అడిగాడు. ఆమె ‘ఔను’ అని సమాధానమిచ్చారు. తరువాత ముహమ్మద్‌ (స) దైవ సందేశహరుడు అని నమ్ముతు న్నావా? అని అడిగాడు. మరలా తను ‘ఔను’ అని సమాధానమిచ్చారు. ఆమె అప్పటికే ముస్లిం అయిపోయినట్లు ఆయన తేల్చి చెప్పేసారు.
    తను ఇస్లాంను అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నానని, తను క్రిస్టియన్‌ నని వాదించారు. (అయితే ఆమెలో ఆలోచన మొదలైంది – ‘నేను ముస్లింని కాగలనా? నేను ఓ అమెరికన్‌ని మరియు వాది తెల్లజాతి! నా భర్త ఏమంటాడు? నేను ముస్లింనైతే, నా భర్తకు విడాకులివ్వవలసి వస్తుందే, అయ్యో! నా కుటుంబం నాశనమైపోతుందే!?’)
    వారు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ‘జ్ఞానాన్ని సంపాదించడం మరియు ఆధ్యాత్మి కతను అర్థం చేసుకోవడమనేది నిచ్చెన ఎక్కు తున్నంత స్వల్పమైనదని, నిచ్చెన ఎక్కేటప్పుడు, నిచ్చెన అడ్డుకర్రలు కొన్నింటిని దాటాలని ప్రయత్నించినప్పుడు, పడిపోయే ప్రమాద ముందని చెప్పుకొచ్చాడాయన.


      ‘షహాదా’ (అంటే దేవుడు ఒక్కడే అని, ముహ మ్మద్‌(స) అల్లాహ్‌ా యొక్క సందేశహరుడు అని  ప్రకటించడం) కేవలం నిచ్చెన పైన వేసే మొదటి అడుగు మాత్రమేనని’ ఆయన వివరించారు.

      మీ ప్రభు వైపునకు మరలండి




         తల్లిదండ్రులు, బంధుమిత్రులు, పొరుగువారు, అతిథుల పట్ల సద్వ్యవహారం కలిగి ఉండండి. ఒకవేళ జనాలు మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించినా మన్నింపుల వైఖరిని అవలంభించండి. అసభ్యంగా వ్యవహరిస్తే హుందాగా సలాం చేసి తప్పుకోండి. ఎట్టి స్థితిలోనూ ఎవ్వరితోనూ కయ్యానికి కాలు దువ్వకండి. సిగ్గుమాలిన పోకడల జోలికి వెళ్ళకండి. సారాయి, జూదం, వ్యభిచారం, పాచికల జోస్యం సమాజాన్ని భ్రష్టు పట్టించే, సంసారాన్ని నట్టేట ముంచే మహా భయంకర వ్యసనాలు. వీటికి దూరంగా మసలుకోండి. ఇదంతా ఎక్కడ నేర్చుకుని చెబుతన్నాడు? అంటారా-; ఇస్లాం ధర్మం నాకు నేర్పిన నైతిక విధానం ఇది. ఇది అన్నీ మతాల్లో ఉన్న అంశాలే కదా అని మీరు అనవచ్చు. నిజమే-, కానీ ఇస్లాంలో ఇలాంటి సమాజానికి పనికివచ్చే హితోక్తులు పరిపూర్ణంగా ఉన్నాయి అని నేనంటాను.
          ఒకప్పుడు నేనూ అందరిలా ఇస్లాం అంటే ఒక ప్రాంతానికి, భాషకి సంబంధించిన మతం అని, అల్లాహ్‌ అంటే కేవలం ముస్లింల దేవుడని, ఖుర్‌ఆన్‌ అంటే ఏదో కొద్దిమంది మత విశ్వాసాలకు సంబంధించిన గ్రంథమని, మహా ప్రవక్త ముహమ్మద్‌ అంటే  అరబ్బు ప్రాతానికి పరిమితమైన ప్రవక్త అని, చివరికి ముస్లిలు అంటే మహమ్మదీయులని (ముహమ్మద్‌ ప్రవక్తను ఆరాధించేవాళ్ళని) అనుకునేవాణ్ణి. కానీ నా అభిప్రాయం తప్పని పుస్తకాలు చదివిన మీదట తెలిసింది. మహా ప్రవక్త (స) వారి జీవిత చరిత్ర ద్వారా మనిషి ఎలా జీవించాలో తెలుసుకున్న నేను, ఖుర్‌ఆన్‌ గ్రంథ పారాయణం ద్వారా జీవితం – జీవితంలోని కష్ట సుఖాలు, మరణం-మరణం తర్వాతి జీవితం పరలోకం, తీర్పు దినం, స్వర్గం, నరకం మొదలైనవి గ్రహించగలిగాను.
          ‘తమ పాపాలపై పశ్చాత్తాపం చెందేవారిని పరిశుద్ధతను, పరిశుభ్రతను పాటించేవారిని అల్లాహ్‌ అమితంగా ప్రేమిస్తాడు”.
         (అల్‌ బఖరా: 222) అన్న మోక్ష సౌరభాలు నిండిన శుభవార్త ఖుర్‌ఆన్‌ లోనిదే. ఇస్లాం కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలో కూడా నేర్పుతుంది అంటే మీరు నమ్ముతారా? చూడండి!
        1) మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు ముందు ఎడమ కాలు పెట్టి లోనికి ప్రవేశిస్తూ ”అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్‌ ఖుబ్‌సీ వల్‌ ఖబాయిస్‌” అనాలి.
        2) నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లోగానీ, నీడనిచ్చే చెట్ల క్రిందగానీ, జనులు నడిచివెళ్ళే రహదారుల్లోగానీ, మల మూత్ర విసర్జన చేయకూడదు.
        3) పిడకలతో, ఎముకలతో ఇస్తిన్జా చేయకూడదు. అలాగే రంద్రాల్లో, బిలముల్లో మూత్రం పోయకూడదు.
        4) మైదాన ప్రదేశాల్లో కాలకృత్యాలకై వెళితే ఏదైనా వస్తును తెరగా పెట్టుకోవాలి.
        5) అనివార్య పరిస్థితిలో తప్ప ఎప్పుడూ మూత్ర విసర్జన కూర్చోనే చేయాలి.
        చూశారుగా ఇస్లాం చూపే జీవన సంవిధానం. త్వరపడిండి. నిజ ధర్మమేదో తెలుసుకోండి. మీ ప్రభు వైపునకు మరలిపోండి. ఆయన ప్రసన్నతను చూరగొని స్వర్గవనాలలో హాయిగా విహరించండి.

        తుది నిర్ణయం మీదే.


        నా పేరు నరసింహులు. నా వయస్సు 50 సమవత్సరాలు. 50 ఏండ్లు అపమార్గాన జీవించిన నేను ముదిమికి చేరుకునే థలో సత్యాన్ని గ్రహించాను. ఇస్లాం అంటే శాంతి, విధేయత, సమర్పణ అని తెలుసుకున్న నేను అన్ని విధాల నా జీవితాన్ని ఆ సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్‌ాకు అంకితం చేశాను. ఇకమీదట నా జీవనం, నా మరణం, నా ప్రార్థన, నా త్యాగం అన్నీ సర్వోన్నతుడైన అల్లాహ్‌ాకే అర్పితం.
         ఇస్లాం అదో విశ్వజనీన ధర్మం. అది మనిషిని దైవభితిని, నైతిక రీతి ప్రబోధించి అతన్ని గొప్ప ధర్మపరాయణుడిగా తీర్చిదిద్దుతుంది. అతనిలో గొప్ప పరివర్తనను తిసుకువచ్చి అతని ఇహపరాల సాఫల్యానికి పూబాట వేస్తుంది. దానికనుగుణంగా నడుచుకునే వారికి అది నిజమైన గౌరవాన్ని ప్రసాదిస్తుంది. మానవులందరి ధర్మమైన ఇస్లాం ఒక్కటే, దైవగ్రంథమైన ఖుర్‌ఆన్‌ ఒక్కటే, అందరి ఆరాధ్య దైవం అల్లాహ్‌ా ఒక్కడే. మానవులంతా ఒక్కటే.
        Ads by bestmarkitAd Options
          పూర్వాశ్రమం గురించి చెప్పాలంటే – అగ్ర వర్ణాలవారు క్రింది వర్ణ జనులతో, దళితులతో కలిసి కూర్చోవడంగానీ, కలిసి భోంచేయడంగానీ ఈ ఆధునిక యుగంలో సైతం చేయరాదు. పైగా అలా చేసేవారిని అసహ్యించుకునేవారూ లేకపోలేదు. ఇస్లాం ప్రకారం అయితే మనిషిని గౌరవించడం, మర్యాదలు చేయడం ఎలాంటి తారతమ్యం పాటించకపోవడం తప్పనిసరి. ఇక్కడ వర్ణ భేదాలు లేవు. కుల పిచ్చీ లేదు. వంశ డాంబీకాలూ లేవు. ఎవరూ పుట్టుక రీత్యా అల్పులు కాదు. మనిషి చేసుకున్న కర్మల్ని బట్టే అతని స్థానం ఏర్పడుతుంది. అందరూ ఒకే దేవుణ్ణి ఆరాధించేవారే, అందరూ దైవ దాసులే, దైవానికి చెందినవారే, సమానులే.
          ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించిన మరుక్షణం అతనిలో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. అతనిపై రెండు బాధ్యతలు మోపబడతాయి.


          1) బహుదైవారాధనను త్రోసిపుచ్చటం. 2) దేవుని ఏకత్వాన్ని స్వీకరించటం. జీవితపు అన్నీ రంగాల్లో ఆయన ఆదేశాలను నిర్వర్తించటం. ఏకేశ్వరుడు చేయమన్న దానిని చేయాలి. వద్దన్న వాటిని విసర్జించాలి. అలా మనం చేసిన నాడు దైవానికి ప్రీతిపాత్రులై స్వర్గంలో మహా ప్రవక్త (స) వారి సాంగత్యాన్ని పొందే సౌభాగ్యాన్ని సొంతం చేసుకున్నవాళ్ళం అవుతాము. ఒక వర్గం స్వర్గానికి వెళితే, మరో వర్గం నరకానికెళుతుంది. ఎటు వెళ్ళాలో మీరే నిర్ణయించుకోండి. ఈ జీవితం మీది. దీన్ని సార్థకం చేసుకుంటారో, వృధా పర్చుకుంటారో మీ ఇష్టం. ధర్మంలో మాత్రం ఎలాంటి బలాత్కారం, బలవంతం లేదు.

          5, మార్చి 2014, బుధవారం

          ఓ లోకమా!


           - శాంతి ప్రియ

          నీ ధన ప్రీతి గూర్చి నే పాడలేను
          దైవ ఘన కీర్తిని నే వీడలేను 

          నేను చూశాను ఐహిక లాలసతో వివేకం 
          కోల్పోయిన అవివేకుల్ని
          నేను చూశాను కామంతో కళ్ళు
          మూసుకుపోయిన నర రూప రాక్షసుల్ని
          నేను చూశాను మద్యం మత్తులో జూదం
          ఆడుతూ మగువలకు వెల కట్టిన కుబేరుల్ని 

          అందుకే-
          నీ మాయ మాటలను నే నమ్మలేను
          మహా ప్రవక్త మహితోక్తులను నే మరువలేను

          నేను చూశాను మత కలహాల్లో మాడి
          మసి అయిన మహిళామణుల్ని, పసి పిల్లల్ని
          నేను చూశాను నిరంకుశ నమ్రూదులను
          మృగరూప నరేంద్రులను, ఫిర్‌ఔన్‌, హామానులను
          నేను చూశాను అలగా జనాల అత్యాచారానికి
          బలైన అబలలను, నిండు గర్భిణులను
          నేను చూశాను నిజంగా త్రిశూల కొనలకు
          వ్రేలాడుతున్న మూడు మాసాల పసి కూనలను
          నేను చూశాను నిజంగా తుపాకీ తూటాలకు 
          తూట్లు పడిన తల్లి హృదయాన్ని,, ఇరాక్‌, ఫలస్తీనాల్ని

          అందుకే-
          నీ చదరంగానికి నే పావుని కాలేను
          మహితాత్ముల బాట నే వదలలేను

          నేను చూశాను మూర్తీభవత్‌ దైన్యాన్ని, హైన్యాన్ని
          రుద్ధభాష్పాకులిత నయనుడైన వృద్ధ తండ్రిని
          నేను చూశాను కన్య కొంగు చాటు కృష్ణుడై
          కన్నవారిపై కన్నెర్రజేసిన కసాయి కొడుకుల్ని
          నేను చూశాను కనక వ్యామోహంతో కొడుకుల్ని
          అమ్మేసుకుంటున్న కట్న పిపాస పిత్రోత్తముల్ని
          ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి? ఏ జ్ఞాని జన్మభూమి
          గర్వ స్థితి?

          నేను పైన దైవానికి జవాబు చెప్పవలసినవాణ్ణి
          క్రింద దాసుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాల్సినవాణ్ణి
          అందుకే ఓ లోకమా!
          నీ వశీకరణ మంత్రాలకు నే లొంగను
          క్షంతవ్యంకాని అలసత్వం నే వహించను